తెలంగాణ వీణ , పాలిటిక్స్ : ఎన్నికల నగారా మోగడంతో పోలీసులు నగర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. మొదటి రోజు నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ.18 కోట్ల వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ తనిఖీలలో పట్టుబడ్డ నగదు, ఆభరణాలను ఐటీ శాఖతో పాటు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పౌరుల వద్ద రూ. 50 వేల కంటే ఎక్కువగా నగదు నిల్వ ఉండకూడదని పోలీసులు సూచించారు.
అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాం కాలేజీ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి పట్టుబడింది, దీని విలువ సుమారు రూ. 10 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓ ఎలక్ట్రిక్ కారులో ఎలాంటి భధ్రత పరమైన చర్యలు లేకుండా 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి తీసికెళ్తుండడంతో పట్టుబడ్డారని తెలిపారు.దీంతో బంగారం, వెండిని స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఇది క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్‌పీ రోడ్డుకు చెందిన తయారీ కంపెనీదని వెల్లడయ్యిందన్నారు.
చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఫిలింనగర్ పరిధిలో షేక్‌పేట్ నారాయణమ్మ కాలేజీ సమీపంలో తనిఖీలు చేస్తుండగా రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
శంకర్‌పల్లి ఠాణా పరిధిలోని బీడీఎల్ చౌరస్తా, గాయత్రి దవాఖాన సమీపంలో రూ.80 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తులను తనిఖీ చేయగా రూ. 30 లక్షలు పట్టుబడ్డాయి.
హాబీబ్‌నగర్‌లో రెండు చోట్ల తనిఖీలు చేయగా రూ. 17 లక్షలు పట్టుబడింది. మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పురానాపూల్‌లో రూ. 15 లక్షలు లభించాయి.
చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో రూ. 9.3 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్‌లో రాయికల్ టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీలలో రూ. 11.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. జుబ్లీహిల్స్‌లోని ప్రగతినగర్, మధురానగర్, బోరబండ ప్రాంతాలలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో అక్రమ మద్యం సీసాలను భారీ ఎత్తున పట్టుకున్నారు. శేరిలింగంపల్లిలోని గోపన్‌పల్లి తండాలో ఓటర్లకు పంచిపెట్టేందుకు నిల్వ చేసిన కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్ యాదవ్ పేరుతో తయారు చేసి అక్రమంగనిల్వ ఉంచిన 90 కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపురం పోలీసులు హోటళ్లలో తనిఖీలు చేపట్టి నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మాసబ్‌ట్యాంక్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ.3,36,100 స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం పోలీసులు సామనగర్ నివాసి నుంచి రూ.5.16 లక్షలు, తుక్కుగూడ నివాసి నుంచి రూ.1.35 లక్షలు స్వాధీనం
చేసుకున్నారు.