తెలంగాణ వీణ , భద్రాచలం : మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి ఒంటిగట సమయంలో భద్రాచలంలోని తన నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు సమాచారం. సత్యవతి మృతిపట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
కుంజా సత్యవతి తన రాజకీయ ప్రస్థానాన్ని సీపీఎంలో మొదలుపెట్టారు. 1991లో భద్రాచలం ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు. తరువాత మళ్లీ సొంతగూటికే చేరిన ఆమె.. కొంతకాలంపాటు రాజకీయాలు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.