తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : క్వారీల మాటున ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సాగిస్తున్న అక్రమ ఖనిజ రవాణా దందాలో కొండలను సైతం పిండి చేసేశారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా రోడ్డు మెటల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో 4.6 హెక్టార్ల రోడ్డు మెటల్ కొండకు ఆ మాజీ ఎమ్మెల్యే బినామీగా పేరున్న కె.సాంబశివుడు లీజు పొందారు. లీజు పొందిన ప్రాంతంలో రోడ్డు మెటల్ తవ్వకాలను చేపట్టి.. మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలించారు. లీజు పొందిన ప్రాంతంలో ఖనిజ నిల్వలు తగ్గిపోవడంతో పక్కనే ఉన్న మరో 1.5హెక్టార్లలో లీజు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి భారీగా రోడ్డు మెటల్ తరలించారు. ఏడాది కాలంగా ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా రోడ్డు మెటల్‌ను తన క్రషర్‌కు తరలించి భారీగా సోమ్ము చేసుకున్నట్లు గనులశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది.
మాజీ ఎమ్మెల్యే బినామీ సాంబశివుడు క్వారీలో అక్రమ తవ్వకాలు చేసి రోడ్డు మెటల్ తరలించారు. దీంతో గనులశాఖ అధికారులు లీజు తీసుకున్న ప్రాంతానికి వెళ్లి కొలతలు తీశారు. లీజు ప్రాంతంతోపాటు పక్కనే ఉన్న మరో ప్రాంతంలో 1.5 హెక్టార్లలో అంటే 3.75 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించి క్వారీ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందనా లేకపోవడంతో రూ.61.35 కోట్ల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేయడంతో పాటు రోడ్డు మెటల్ క్వారీని సీజ్ చేశారు.
జరిమానా చెల్లించే వరకు ఖనిజం తవ్వకాలు చేపట్టరాదని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, క్వారీని సీజ్ చేసినా నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. క్వారీలో రాత్రి పూట అక్రమ తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలిస్తున్నారు. సీజ్ చేసిన తర్వాత గనుల శాఖ అధికారులు క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదనుగా భావించిన క్వారీ నిర్వాహకులు తవ్వకాలు చేపట్టి ఖనిజాన్ని తరలిస్తున్నారు. గనులశాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.