తెలంగాణ వీణ , జాతీయం : ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశలు పెట్టుకున్న నాయకులకు బ్యూరోక్రాట్లు గండికొడుతున్నారు. నిన్న..మొన్న కాషాయ కండువా కప్పుకున్న మాజీ అధికారులు టికెట్‌లు ఎగరేసుకుపోతున్నారు. పార్టీ అధిష్ఠానం తమను కాదని బ్యూరోక్రాట్ల పట్ల మొగ్గు చూపడం బీజేపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
కేంద్రంలో సివిల్ సర్వెంట్ల ప్రభావం నానాటికీ పెచ్చుమీరుతున్నదని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ మంత్రి విమర్శించారు. ఈ ఏడాది జూలైలో జరిగిన క్యాబినెట్ భేటీలో ఐఏఎస్ అధికారులే ప్రజెంటేషన్ ఇచ్చారని ఉదహరించారు. మా కార్యక్రమాలపై పీఎంఓ నిఘా వేస్తుంది. మేం ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలో పీఎంఓలోని అధికారులే నిర్ణయిస్తారు. బ్యూరోక్రాట్లకు ఆదేశాలను అమలు చేయడమే తెలుసు, వారికి ఎదురుచెప్పడం రాదు.. అందుకే మోదీ వారినే ఎక్కువగా నమ్ముతారు. ప్రజలకు హాని చేసే నిర్ణయాలను అమలు
చేయడానికి మేమైతే వెనుకడుగు వేస్తాం.. అందుకే ఆయన మమ్మల్ని విశ్వసించరు’ అంటూ కుండబద్దలు కొట్టారు.