తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం హైదరాబాద్‌లో వరుస భేటీలు జరపనుంది. వివిధ రాజకీయ పార్టీలతో.. ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధత తదితర అంశాలపై సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఓ ప్రముఖ హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం అవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటలవరకుపలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమీక్షించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్‌తో పాటు డబ్బు, ఉచిత పంపిణీలు, మద్యం సరఫరా సహాపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఇక 4వ తేది ఉదయం 6.30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లోథాన్, వాక్ థాన్ నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచిసాయంత్రం 7 వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో ఎన్నికల బృందం సమావేశమవ్వనుంది. 5వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ అవ్వనుంది. 11 గంటలకు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. అలాగే మధ్యాహ్నాం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్, ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది.గత ఎన్నికల సమయంలో.. అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. ఈ తరుణంలో.. ఈసారి కూడా పర్యటన ముగిసిన అనంతరం అక్టోబర్ 6 లేదా 7వ తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.