తెలంగాణ వీణ ,హైదరాబాద్ : ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల15న మొదటి రోజు శరన్నవరాత్రి ఉత్సవాలను అమ్మవారికి పట్టు వస్రాలు సమర్పించి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేందర్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
అదేరోజు శ్రీశైలపుత్రి (బాలా త్రిపుర సుందరి) అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. రెండో రోజు బ్రహాచారిని (గాయత్రీ దేవి)గా, మూడో రోజు చంద్ర గంట (అన్నపూర్ణ) అవతారంలో దర్శనం ఇస్తారు. నాలుగో రోజు కూష్మాండ (వనదుర్గా)గా, ఐదో రోజు స్కంద మాత (మహాలక్ష్మి)గా, ఆరో రోజు షష్టి కాత్యాయని (సరస్వతిదేవి)గా దర్శనమిస్తారు. ఏడో రోజు కాల రాత్రి (దుర్గాదేవి), 8వ రోజు మహా గౌరీ సిద్ధి రాత్రి (మహిషాసురా మర్ధిని)గా, చివరి రోజు 9వ రోజు నవమి, దశమి (విజయదశమి) రాజరాజేశ్వరీదేవీగా దర్శనం ఇస్తారని ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్‌రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 20న ఉదయం 11 గంటలకు బోనాల కార్యక్రమం, 22న చండీ హోమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమాలను జయప్రదం చేయాలని భక్తులకు విజ్ఞప్తిచేశారు.