తెలంగాణ వీణ , జాతీయం : రాజధాని బెంగళూరు నగరం అతి వేగంగా విస్తరిస్తోందని రానున్న రోజుల్లో కనకపుర కూడా నగరంలో కలసిపోయే అవకాశం ఉందని అప్పుడు భూముల ధర బం గారం అవుతుందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. త్వరపడి భూములు అమ్ముకోవద్దని ఆయన రైతులను కోరారు. కనకపుర తాలూకాలోని శివనహళ్ళి గ్రామంలో వీరభద్రస్వామి దేవస్థాన జీర్ణోద్ధరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం మాట్లాడుతూ కనకపురలో కేఎంఎఫ్ డైరీ ఉందని, అత్యాధునిక ఆసుపత్రులు, ఉన్నత విద్యాసంస్థలు, పలు వ్యాపారసంస్థలు ఉన్నాయన్నారు. బెంగళూరు నగర పరిధి క్రమేపీ విస్తరించుకుంటే కనకపుర ఎంతో దూరం కాబోదన్నారు. రామనగర జిల్లాలో ఉన్నా కనకపుర, బెంగళూరుకు సమీపంలో ఉండడమే ఇందుకు కారణమన్నారు. హిందూమతంలో ఎన్నో పురాతన ఆలయాలు, మహిమాన్విత దేవుళ్లు ఉన్నారని పేర్కొన్న ఆయన దేవుళ్లకు నిత్య కైంకర్యాలు జరిగితే వీరి అనుగ్రహం ప్రజలపై మెండుగా ఉం టుందన్నారు. కాంగ్రెస్ అన్ని మతాలను సమానంగా చూస్తూ గౌరవిస్తుందన్నారు.