తెలంగాణ వీణ, కామారెడ్డి : ప్రైవేటు వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న లక్ష్మీ (32) మహిళకు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన మురికి రాజు మానవతా దృక్పథంతో స్పందించి మొదటిసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు పేర్కొన్నారు.చాలామంది రక్తదానం చేయాలంటే భయపడడం జరుగుతుందని, రక్తదానం చేస్తే బలహీనంగా అవుతాము అనే భావన సమాజంలో ఉన్నదని,కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రక్తదానం చేయడం వల్ల రావని అన్నారు.చాలా రకాలైన పరిశోధనలు తరచుగా రక్తదానం చేసే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలియజేయడం జరిగిందని,రక్తదానం అంటే ప్రాణాలను కాపాడమే కాకుండా రక్తదానం చేసే వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారని ప్రతి ఒక్కరు జీవితంలో రక్తదానం చేయాలని,ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే రక్తదానం చేయగలుగుతామని అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు జీవితంలో రక్తదానం చేసే అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని మానవతా దృక్పథంతో రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,జిల్లా కలెక్టర్,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు అశోక్ రెడ్డి మొదలగు వారు పాల్గొనడం జరిగింది.