తెలంగాణ వీణ , హైదరాబాద్ : చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ శుక్రవారం ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 8.30కి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. శుక్రవారమే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ప్రారంభిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేస్తారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్ఫాహారాన్ని వడ్డిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా, మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా అల్పాహారాన్ని అందజేయనున్నారు.
సోమవారం: ఇడ్లీ సాంబార్/ గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం: పూరి, ఆలు కుర్మా/ టమాటా బాత్, చట్నీ
బుధవారం: ఉప్మా,సాంబార్/ కిచిడీ, చట్నీ
గురువారం: మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ / పొంగల్, సాంబార్
శుక్రవారం: ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ/ కిచిడీ, చట్నీ
శనివారం: పొంగల్, సాంబార్/వెజ్ పలావ్, రైతా/ఆలు కుర్మా
పదో తరగతి వరకు..
ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకాన్ని తొలుత తమిళనాడులో ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. ఈ పథకాన్ని మన రాష్ట్ర ఐఏఎస్ అధికారుల బృందం అధ్యయనం చేసింది. తమిళనాడులో 1-5 తరగతుల విద్యార్థులకే అల్పాహారాన్ని అందిస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో 1 -10 తరగతుల్లోని విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని పలు రాష్ర్టాల్లో 1 -8 తరగతుల వరకే అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నది. గత ఏడాది నుంచి బెల్లం కలిపిన రాగిజావను అందజేస్తున్నది. పదో తరతతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ సమయంలో ఉచితంగా స్నాక్స్‌ను ఏర్పాటు చేసింది.
ఆహా.. అద్భుతమైన అల్పాహార మెనూ
బ్రేక్‌ఫాస్ట్ అంటే మొక్కుబడిగా కాకుండా అందరూ ఆశ్చర్యపోయేలా ప్రభుత్వం మెనూను సిద్ధం చేసింది. మిల్లెట్ ఇడ్లీ, ఇడ్లీ సాంబార్, ఉప్మా, పూరి, టమాటా బాత్, కిచిడీ, పొంగల్, పోహా, వెజిటబుల్ పొలావ్ రకరకాల టిఫిన్లను అందించనున్నది. ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, కోడిగుడ్లను అందిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ సిద్ధించాక విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎన్నో గొప్ప సంస్కరణలు చేశాం. ఇప్పుడు మరో ముందడుగు వేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. దేశంలోనే తొలిసారిగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం అమలు తీరుపై నిత్య పర్యవేక్షణ ఉంటుంది. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాం. విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పథకాన్ని పర్యవేక్షిస్తాయి. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకంతో డ్రాపౌట్లు తగ్గుతాయని, హాజరు శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.672 కోట్లు ఖర్చు చేస్తున్నది. సన్న బియ్యంతో భోజనం, వారానికి మూడు గుడ్లు అందిస్తున్నాం. సన్న బియ్యం కోసం రూ.187 కోట్లు, గుడ్ల కోసం రూ.120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భరిస్తున్నది. రూ.32 కోట్లు వెచ్చించి ఐరన్, సూక్ష్మ పోషకాలతో కూడిన రాగి జావను అందిస్తున్నాం. విద్యాశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు.