తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోమారు రుజువైంది. 2014 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న ఈహెచ్ స్కీంను ప్రకటించిన సీఎం.. లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులు నాణ్యమైన వైద్య సేవలను ఇష్టం వచ్చిన చోట క్యాష్‌లెస్‌గా పొందొచ్చు.
. ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు.
-ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీపికబురు చెప్పారు. దసరాకు ముందే లక్షల కుటుంబాల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ‘ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (ఈహెచ్‌టీసీ) ఏర్పాటు చేసి నూతన ‘ఎంప్లాయిస్ హెల్త్ సీమ్’ను (ఈహెచ్‌ఎస్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ జీవో నంబర్ 186ను విడుదల చేసింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడు లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొదటి పీఆర్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా ట్రస్ట్‌కు జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
నిర్వహణకు ప్రత్యేక బోర్డు
నూతన ఆరోగ్య పథకం అమలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్‌కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ కాంట్రూబ్యుషన్‌గా ట్రస్టుకు ప్రతి నెల నిర్దేశిత మొత్తాన్ని జమ చేస్తారు. ఈ మొత్తం ప్రతినెల వారి వేతనం నుంచి ఆటోమెటిక్‌గా ట్రస్ట్‌కు బదిలీ అవుతుంది. ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్‌గా జమ చేస్తుంది. ఈహెచ్‌ఎస్ నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు 15 పోస్టులు మంజూరు చేసింది.
ఉద్యోగుల కష్టాలన్నీ దూరం
2014 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లంతా ఈహెచ్‌ఎస్ పథకం కోసం వేయికండ్లతో వేచిచూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఈహెచ్‌ఎస్ పథకాన్ని అమలుచేస్తామని అప్పటి సీఎం వైఎస్సాఆర్ ప్రకటించారు. అయినా ముందడుగు పడలేదు. ఉద్యోగులకు నిరాశే మిగిలింది. అద్భుతమైన ఈహెచ్‌ఎస్ పథకాన్ని ప్రకటించి ఏ ముఖ్యమంత్రికీ సాధ్యంకాని దానిని సీఎం కేసీఆర్ సుసాధ్యం చేశారు. ఈ పథకంతో ఉద్యోగుల కష్టాలన్నీ దూరమవుతాయి. ఇటీవలే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, వెంటనే ఈహెచ్‌ఎస్‌ను ప్రకటించడంతో ఉద్యోగులమంతా సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
దేశంలోనే ఇది తొలిసారి
నూతన హెల్త్ స్కీం పథకాన్ని ఆమోదించినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. ఉద్యోగులకు ఇలాంటి పథకం అమలు చేయడం దేశంలోనే ఇది తొలిసారి. ఈ పథకాన్ని ఎయిడెడ్, మాడల్‌స్కూల్, గురుకుల పాఠశాలల్లోని టీచర్లకూ వర్తింపజేయాలి.
– పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలార్‌రావు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
80% పెన్షనర్లకు లాభం
ఈహెచ్‌ఎస్‌తో 80శాతం పెన్షనర్లు లబ్ధిపొందుతారు. పదవీ విరమణ పొందిన తర్వాత పెన్షనర్లు షుగర్, బీపీ వంటి అనేక రుగ్మతలతో బాధపడుతున్నారు. చాలీచాలని పెన్షన్‌తో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారు ఆపదొచ్చి దవాఖానకు వెళితే లక్షలకు లక్షలు ఖర్చుచేయాల్సి వస్తున్నది. ఇలాంటి వాళ్లకు ఈహెచ్‌ఎస్‌తో భరోసా దొరుకుతుంది. పెన్షనర్ల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
-కే లక్ష్మయ్య, ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్
పాలసీల అవసరముండదు
ఉద్యోగుల ఆరోగ్య బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే ఈ హెచ్‌ఎస్‌ను ప్రకటించడం సంతోషం. ఉద్యోగులుగా సేవలందించి అనారోగ్యం పాలై దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్న ఎంతో మంది పెన్షనర్లకు ఈ పథకంలో ఉపశమనం కలుగుతుంది. ఇక నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాల్సిన అవసరముండదు. ఉద్యోగుల పక్షాన ఉంటు న్న బీఆర్‌ఎస్, ప్రభుత్వానికి అండగా నిలుస్తాం.
– ఎండీ ముజీబ్ హుస్సేని, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఇది తీపికబురు
ఇది ఉద్యోగులందరికీ తీపికబురు. వారి సంక్షేమంలో ఎప్పుడూ ముందుండే తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ కమి టీ ఏర్పాటు, ఈహెచ్‌ఎస్ పథకంతో మరోమారు తమది ఎంప్లా యీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చాటిచెప్పింది. ఈ పథకం రూపకల్పనకు కృషిచేసిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు ధన్యవాదాలు.
– మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హన్మంత్‌నాయక్, గ్రూప్ -1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
ఈహెచ్‌ఎస్‌ను స్వాగతిస్తున్నాం
ఉద్యోగుల సంక్షేమం కోసం ఈహెచ్‌ఎస్‌ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ పథకంతో రాష్ట్రంలోని ఏడున్నర లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లాభం చేకూరుతుంది. ఈహెచ్‌ఎస్ స్కీంపై గతంలో సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తిచేశాం. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు హెల్త్ స్కీంపై నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఉద్యోగుల సంక్షేమంలో ముందుండే ప్రభుత్వ.. పీఆర్సీ కమిటీని నియమించి, ఇప్పుడు కీలకమైన ఈహెచ్‌ఎస్‌ను నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
– వీ మమత, ఏనుగుల సత్యనారాయణ, టీజీవో అధ్యక్షప్రధాన కార్యదర్శులు
ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు ట్రెసా తరఫున అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. ఉద్యోగులు, పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కొత్తగా ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పథకం అమలు చేయాలని నిర్ణయించడం హర్షనీయం. తాజా నిర్ణయంతో తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి.
– వంగ రవీందర్ రెడ్డి, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నూతన పథకాన్ని అమలు చేయడం సంతోషించాల్సిన విషయం. ఉద్యోగుల కోసం ఇంతమంచి పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు బీసీ ఉద్యోగుల పక్షాన తరఫున ధన్యవాదాలు.