తెలంగాణ వీణ , హైదరాబాద్ : మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ 18వ తేదీవరకు ఏడు సభల్లో ప్రసంగించారు. బతుకమ్మ, దసరా నేపథ్యంలో ప్రచారానికి విరామం ఇచ్చిన బీఆర్‌ఎస్ అధినేత మరోసారి సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. నేటి నుంచి వచ్చే నెల 9 వరకు 13 రోజుల్లో 36 సభల్లో పాల్గొననున్నారు.
ఇందులో భాగంగా నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, వనపర్తి, నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష మంది చొప్పున సభలకు తరలిరానున్నారు. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.