తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్‌ఎస్ విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణగర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్త్రాలుగా సీఎం కేసీఆర్ ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రచార వ్యూహాన్ని ఖరారుచేశారు. ఈ నెల 15న ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. తొలి విడతలో భాగంగా 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టిరానున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న సిద్దిపేటలో ప్రచారం చేయనున్నారు. ప్రగతి-ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. నేపథ్యంలో సభా స్థలిని మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అధికారులు సలహాలు, సూచనలు అందించారు
స్వరాష్ట్రంలో జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రచార పర్వాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించినట్టే ఈ సారీ అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. తొలి విడతగా 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టే బాధ్యతను కేసీఆర్ నెత్తికెత్తుకున్నారు. 17 రోజుల షెడ్యూల్‌లో నవంబర్ 9న రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలుచేసి సభల్లో పాల్గొంటారు. 15వ తేదీన హుస్నాబాద్ సభతో ప్రచారం జోరు మొదలు కానున్నది. 15 నుంచి 18వ తేదీ వరకు 5 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. దసరా పండుగ తర్వాత 26 నుంచి తిరిగి ప్రచారం ప్రారంభిస్తారు.