తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకం పర్యవేక్షణ బాధ్యతలను మూడు శాఖలకు అప్పగించారు. పాఠశాల విద్యాశాఖ ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుండగా, మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖలు పథకం అమలును పర్యవేక్షించనున్నాయి. నాణ్యంగా, పరిశుభ్రంగా (హైజీన్) పౌష్టికాహారాన్ని అందించేలా ఆయా పర్యవేక్షిస్తాయి. హెచ్‌ఎంలు సహా విద్యాశాఖలోని ఇతర అధికారులకు సైతం పర్యవేక్షణ బాధ్యలు అప్పగించగా, ఇతర అవసరాల దృష్ట్యా మిగతాశాఖల సహకారాన్ని తీసుకుంటున్నారు. విద్యాశాఖలో అమలవతున్న కార్యక్రమాలు, పథకాలతో ప్రధానోపాధ్యాయలపై భారం పడుతున్నది. ఈ నేపథ్యంలోనే వారిపై భారాన్ని తగ్గించడం, మిగతాశాఖలకు భాగస్వామ్యం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ఇప్పటికే ప్రారంభమైంది. దసరా తర్వాత రాష్ట్రమంతటా అమలుకానున్నది.
పర్యవేక్షణ ఇలా..
పాఠశాలలో హెచ్‌ఎం, స్కూల్ క్లాంప్లెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెచ్‌ఎం, మండలంలో నోడల్ అధికారులు, జిల్లాలో డీఈవోలు పర్యవేక్షణ జరుపుతారు. ఇతర అంశాల పర్యవేక్షణ కోసం మూడు శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, డీఈవోలు, సమగ్రశిక్ష కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు పర్యవేక్షణ జరుపుతారు.
బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలుపై ఇప్పటికే మహిళా శిశుసంక్షేమశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ శాఖ సీడీపీవోలు పథకం అమలు, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఆరోగ్యలక్ష్మి పథకం సహా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే బాధ్యతలను వీరు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని చెకింగ్ చేయనున్నారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కమిషనర్లు పర్యవేక్షణ జరుపుతారు. కార్పొరేషన్లలో కమిషనర్లే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. వీరు తమ శాఖలోని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు.
పరిశుభ్రత, శానిటేషన్ బాధ్యతలను మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖలకు అప్పగించారు. మిగిలిపోయిన ఉపాహారం, విద్యార్థులు తినగా పారేసిన ఆహారాన్ని, వ్యర్థపధార్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం వీరి బాధ్యత.
టిఫిన్లు తయారుచేయడం, నిర్దిష్ట పరిమాణంలో పదార్థాలను కలపడంపై మధ్యాహ్న భోజన కార్మికులకు నిపుణుల చేత శిక్షణనిస్తారు. ఉదాహరణలో మిల్లెట్ ఇడ్లీలో కాస్త పెరుగు కలుపుతుంటారు. ఇలాంటి చిట్కాలపై త్వరలో కార్మికులకు శిక్షణ ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో శిక్షణకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు మూడు సంస్థలను ఎంపికచేశారు.
స్కూళ్లల్లోని కిచెన్‌షెడ్లను ఆధునీకరిస్తారు. ఇందుకు సాంకేతిక సంస్థల సహకారాన్ని తీసుకుంటారు.
బ్రేక్‌ఫాస్ట్ స్కీం మానిటరింగ్, ట్రాకింగ్ కోసం ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ను, ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు.