Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ముఖ్యమంత్రి అల్పాహారం పేద పిల్లలకు వరం

Must read

తెలంగాణ వీణ ,హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం పేద పిల్లలకు వరం అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని, పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది కానుందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ పథకాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బ్రేక్‌ఫాస్ట్‌ పథకంతో రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రతి ఆలోచన వెనకా మానవీయ కోణం ఉంటుందని, ప్రతి పథకం అమలుకు ముందు ఆయన సామాజిక కోణంతో ఆలోచిస్తారని అన్నారు. అందుకే అవి విజయవంతమవుతూ సామాజిక మార్పులకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ కూడా కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదని, పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ తగ్గించి, బడి ఈడు పిల్లలందరినీ బడిబాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకమని చెప్పారు. 9, 10 తరగతుల విద్యార్థులకు దేశంలో మనం మాత్రమే భోజనం అందిస్తున్నామన్నారు. దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్‌ ఫాస్ట్‌ పథకం నిరంతరంగా అమలవుతుందని ఆయన చెప్పారు.

ఆకలి తీర్చడంతోపాటు..

విద్యార్థుల ఆకలి తీర్చడంతోపాటు వారు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలనే ఉద్దేశంతోనే సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఇప్పటికే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని తెలిపారు. ప్రైవేటు స్కూళకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని, రూ.7,300 కోట్ల నిధులతో మన ఊరు-మన బడి ద్వారా పాఠశాలల రూపురేఖల్ని మార్చే యజ్ఞం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అనితా హరినాథ్‌రెడ్డి, ఎంపీ లు రంజిత్‌రెడ్డి, పాటిల్‌, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వెస్ట్‌ మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అల్పాహారం నాణ్యతగా ఉండేలా చూడాలని, క్రమం తప్పకుండా నమూనాలు సేకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ను ఆదేశించారు.

బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయం: హరీశ్‌రావు

నిజామాబాద్‌/కామారెడ్డి/కోరుట్ల/ఇల్లంతకుంట : వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా.. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించడం, కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజల కష్టాలు చూసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని, వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టే మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుందని చెప్పారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా దర్పల్లిలో కామారెడ్డి జిల్లా బిచ్కుందలో, జగిత్యాల జిల్లా కోరుట్లలో వంద పడకల ఆస్పత్రులకు, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 50 పడకల ఆస్పత్రులకు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా చోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న అవగాహన ప్రధాని మోదీకి లేదని, మాట ఇస్తే తప్పని నాయకుడు కేసీఆర్‌ అని తెలిపారు.

వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని, వారి మాటలను నమ్మితే ఆగమైపోతామన్నారు. పొరపాటున అయినా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వెనకబడి పోతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గొడ్డుకారంతో భోజనం పెడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కానీ, తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మమకారంతో విద్యార్థులకు అల్పాహారం, సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని జాకీలు పెట్టి లేపినా.. అధికారంలోకి రాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దొంగ సర్వేలు చేసి గెలిచినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని, ఆ ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్‌ రన్‌ అవుట్‌.. బీజేపీ డకౌట్‌ అవుతాయని, కేసీఆర్‌ సిక్సర్‌ కొడతారన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలపై కాంగ్రెస్‌ విసిరిన సవాలుకు తాము సిద్ధమని హరీశ్‌రావు ప్రకటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you