తెలంగాణ వీణ, హైదరాబాద్ : వేదికపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్.ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనపై విలేకరుల సమావేశం ప్రారంభం.
ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీష్ గఢ్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మొత్తం ఐదు రాష్ట్రాల్లో 40 రోజుల పాటు పర్యటించి పరిస్థితులను సమీక్షించామని ఆయన చెప్పారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని తెలిపారు. ఐదు రాష్ట్రాలలో 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిలో తెలంగాణలో 119 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్ లో 230 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 200 నియోజకవర్గాలు, ఛత్తీస్ గఢ్ లో 90 నియోజకవర్గాలు, మిజోరంలో 40 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 8.2 కోట్ల మంది పురుషులు కాగా, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 60.20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా, చత్తీస్ గఢ్ లో 2.03 కోట్లు , మధ్య ప్రదేశ్ లో 5.6 కోట్లు, రాజస్థాన్ లో 5.25 కోట్లు, మిజోరంలో 8.52 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో జెండర్ రేషియో 998 ఉందన్నారు. తెలంగాణలో 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు 3,35,043 ఉన్నారు. తెలంగాణలో కొత్త ఓటర్లు 17,01,087 మంది ఉన్నారు. తెలంగాణలో తొలగించిన ఓట్లు 6,10,694 వెల్లడించారు. తెలంగాణలో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలు 36,366 ఉంటాయని ఈసీ తెలిపారు.మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణలో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లను10 తేదీ నుంచి స్వీకరిస్తారు. పరిశీలన 13వ వరకు చేస్తారు. నామినేషన్లకు నవంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. డిసెంబర్ 5వ తేదీ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది.