తెలంగాణ వీణ , హైదరాబాద్ : పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అద్భుతమైన సమన్వయంతో ముందుకు సాగుతున్నాం కనుకే బీఆర్‌ఎస్ పార్టీ జైత్రయాత్రను కొనసాగిస్తున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలను గోల్‌మాల్ చేస్తూ గందరగోళానికి గురిచేసే కాంగ్రెస్ పార్టీ కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేది గులాబీ సైన్యమేనని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జనగామ నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘అందరం ఒకే నాయకుని కింద, ఒకే జెండా కింద.. ఒకే ధ్యేయం కోసం పనిచేస్తున్నాం.
కేసీఆర్ తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలె. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హ్యాట్రిక్ సీఎం కావాలె’ అని ఆయన పిలుపునిచ్చారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్‌లాంటి మొదనష్టపు పార్టీ చేతిలో పొరపాటున కూడా పెట్టొద్దు’ అని చెప్పారు. రైతులను గోల్‌మాల్‌చేసి, ఆగం చేసి ఎట్లయినా పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దు.. అన్నిరకాలుగా ఆదుకున్నది బీఆర్‌ఎస్ పార్టీయేనని రైతులకు, ప్రజలకు విడమరచి చెప్పాలని సూచించారు. ఈ నెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.