తెలంగాణ వీణ , పాలిటిక్స్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. ఈ నెల 15న పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్నారు. వారితో సమావేశమై ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఇతర అంశాలపై సూచనలు చేస్తారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు ఎలా వివరించాలో, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రచారం ఎలా నిర్వహించాలో అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం అదేరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చేరుకుంటారు. నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ప్రసంగించి ఎన్నికల శంఖారావం పూరిస్తారు. సీఎం కేసీఆర్ 16 నుంచి వరుసగా జిల్లాల పర్యటనలు చేయనున్నారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, మేడ్చల్ బహిరంగ సభల్లో పాల్గొంటారు.
ఒకే రోజు రెండుచోట్ల నామినేషన్లు
సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. నవంబర్ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. 3 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.