తెలంగాణ వీణ , హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై నామినేషన్ల పర్వానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రచార పర్వంలో ఎదురయ్యే సవాళ్లు, ప్రతి సవాళ్లపై లోతుగా పోస్ట్మార్టం చేస్తోంది. పార్టీతోపాటు అభ్యర్థుల బలాలు, బలహీనతలు, గెలుపు అవకాశాలు, విపక్షాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. తెలంగాణ ఉద్యమ పార్టీ మొదలై అధికార పార్టీగా తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానం ఓట్లు సాధించి పెడుతుందనే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది. పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలు తదితర అంశాలు తమను మూడోసారి అధికారంలోకి తెస్తాయని నమ్ముతోంది.
వ్యతిరేకతను ఇలా అధిగమించాలని..
2014లో తొలిసారి ఉద్యమ చైతన్యం, రెండోసారి 2018లో సంక్షేమ సంబురం అధికారంలోకి తీసుకురాగా.. ఇప్పుడు మూడోసారి ‘పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం’ తమను అధికారంలోకి తెస్తుందని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అయితే.. తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలో ఉండటంతో అటు ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులపై నెలకొన్న కొద్దిపాటి వ్యతిరేకతను ‘తెలంగాణ మోడల్’తో అధిగమించాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పారీ్టలు వాటి వాస్తవ బలం కంటే ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయన్న అంచనాతో ఇందుకు దీటుగా వ్యూహాలకు పదును పెడుతోంది.
పనితీరుతో మూడోసారి అధికారం
తెలంగాణ సాధనలో, సీఎంగా కేసీఆర్ సాధించిన ఫలితాలు మూడోసారి అధికారాన్ని సాధించి పెడతాయనే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా వంటి పథకాలు పార్టీ సానుకూల ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేశాయన్న భావన వ్యక్తమవుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి హైదరాబాద్లో మౌలిక వసతుల కల్పన, విద్యుత్ సరఫరా మెరుగుదల, వైద్య రంగం బలోపేతం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి అంశాలు సానుకూలత తెస్తాయని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.