తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్బంగా తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక అంశం పై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో, అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అంబర్‌పేట నుంచి బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలను కిషన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టతనిచ్చారు. మరోవైపు.. ఎంపీ లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. దీంతో, ముషీరాబాద్ నుంచి కొత్త వారికి టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి.. ఎల్బీనగర్ నుంచి బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక, ఇబ్రహీంపట్నం నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. కాగా, ఇప్పటికే రెండు స్థానాల్లో పోటీచేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గజ్వేల్, హుజురాబాద్ నుంచి ఈటల ఆసక్తిగా ఉన్నారు. దీంతో, మిగతా అభ్యర్థుల్లో ఎక్కడ నుంచి సీటు ఇస్తారనే టెన్షన్ నెలకొంది.