తెలంగాణ వీణ , హైదరాబాద్ : వేములవాడలో బీజేపీకి బిగ్ షాక్ వేములవాడ నియోజకవర్గంలోని ఇద్దరు బీజేపీ ముఖ్య నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, వేములవాడ రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బండ మల్లేశం యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపు బాలరాజు మంగళవారం సిరిసిల్లలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కే తారక రామారావు సమక్షంలో వేములవాడ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బండ మల్లేశం యాదవ్, గోపు బాలరాజు కమల దళాన్ని వీడి అధికార పార్టీలో చేరే అవకాశం ఉందని గత కొద్దిరోజులుగా వేములవాడలో ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని తొలుత ఖండించిన వారు ఎట్టకేలకు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు వారిద్దరూ తమ రాజీనామా లేఖను వాట్సాప్ ద్వారా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు పంపించారు.