తెలంగాణ వీణ , జాతీయం : కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ ఎన్ని కుటిల ప్రయత్నాలు సాగించినా తమిళుల హృదయాల్లో స్థానం సంపాదించ లేదని డీఎంకే యువజన విభాగం నేత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి అన్నారు. చేపాక్‌లోని కలైవానర్ అరంగంలో శనివారం ఉదయం నీట్‌కు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించి తొలి సంతకం చేశారు. డీఎంకే వైద్యవిభాగం కార్యదర్శి ఎళిలన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా, వైద్య విభాగం అధ్యక్షురాలు కనిమొళి ఎన్వీఎన్ సోము, ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి ఉదయినిధి మాట్లాడుతూ… నీట్ రద్దు కోసం డీఎంకే, దాని యువజన విభాగం కలిసికట్టుగా పోరాడుతూనే ఉంటాయని చెప్పారు. నీట్‌కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలను సేకరించి, వాటిని రాష్ట్రపతికి పంపనున్నామని తెలిపారు.