తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశానికి కంచుకోటగా చెప్పుకొనే ఉండి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు రోడ్డెక్కాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉండి రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఉన్న టీడీపీ మండల కార్యాలయం ముందు ఆదివారం టీడీపీ నాయకులు నిరసనదీక్ష చేపట్టారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొని శ్రేణులను ఉత్సాహపరుస్తూ వారితో నిరసనకు దిగారు.
అనంతరం శిబిరంలోకి ఎమ్మెల్యే రామరాజు వచ్చారు. కొద్దిసేపటి తరువాత మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆ శిబిరానికి పక్కనే మరో శిబిరం ఏర్పాటు చేయించి అందులో కూర్చుని నిరసన చేపట్టారు. దీంతో ఆయన అనుచరులు కూడా ఆ శిబిరంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల విభేదాలు మరోసారి రోడ్డెక్కడంతో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
చాలామంది మాజీ ఎమ్మెల్యే శివరామరాజు శిబిరంలోకి చేరి ఆయనకు మద్దతు తెలపడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఈ మధ్యకాలంలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకునేందుకే టీడీపీ నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుగానీ వారికి చిత్తశుద్ధి లేదంటూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రస్తుత ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దూషణలకు దిగారు. ఉండి టీడీపీ కంచుకోటకు బీటలువారాయని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు.