తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ- ఎస్‌ఎంఎస్, పౌరుల కోసం సీ-విజిల్ యాప్స్‌ను ప్రవేశపెట్టింది. తనిఖీలలో దొరికే నగదు, మద్యం, డ్రగ్స్, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి, డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, ఐటీ శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి ‘ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఈ-ఎస్‌ఎంఎస్) అనే యాప్‌ను వినియోగిస్తున్నది.

ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా ‘సీ-విజిల్’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.