తెలంగాణ వీణ , జాతీయం : ‘కాలీ పీలి ట్యాక్సీ’లు.. వీటి గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ముంబై వాసులు ‘కాలీ పీలి ట్యాక్సీ’ లను ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే వీటికి అంత ఘన చరిత్ర ఉంది. ప్రస్తుత తరం వారికి ట్యాక్సీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఓలా, ఊబర్ వాహనాలే. ఎక్కడికి వెళ్లాలన్నా వెంటనే ఓలా, ఊబర్ క్యాబ్‌ను బుక్ చేసుకొని వెళ్లిపోతుంటారు. అయితే, పాత తరం ముంబై వాసులకు మాత్రం క్యాబ్ అంటే నలుపు, పసుపు రంగులో ఉండే ప్రీమియర్ పద్మిని కార్లే గుర్తొస్తాయి. వారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఈ కాలీ పీలి ట్యాక్సీలనే ఉపయోగించేవారు. దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా ఈ పద్మిని ప్రీమియర్ కార్లు ముంబై వాసులకు సేవలందిస్తున్నాయి. అయితే, ఈ కార్లు ఇకపై కనుమరుగు కానున్నాయి. కాలం చెల్లిన ఈ వాహనాలకు ముంబై వాసులు నేటితో వీడ్కోలు పలకబోతున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా కాలీ పీలి వాహనాలతో తనకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘నేటి నుంచి ఐకానిక్ ప్రీమియర్ పద్మిని ట్యాక్సీలు ముంబై రోడ్ల నుంచి కనుమరుగు కానున్నాయి. ఇవి గొప్పవి కాకపోవచ్చు. శిథిలావస్థకు చేరిన ఈ వాహనాలు.. సౌకర్యమైనవి కాకపోవచ్చు. పెద్దగా శబ్ధం చేస్తూ.. లగేజీ పెట్టుకోవడానికి కూడా పెద్దగా చోటు ఉండకపోవచ్చు.. కానీ, పాతకాలపు వారికి అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలు మిగిల్చాయి.