తెలంగాణ వీణ , ఆదిలాబాద్ : ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది.
10న రాజేంద్రనగర్ నియోజకవర్గపరిధిలోని శంషాబాద్‌లో అదేరోజు సాయంత్రం అమిత్ షా సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఈ సభ రద్దు అయింది. దీనికి బదులు సికింద్రాబాద్ సిఖ్ విలేజీలోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొనున్నారు. మేధావుల సదస్సు సక్సెస్‌పై ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో లీగల్ సెల్‌తోపాటు ఇతర మేధావులతో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు.
సదస్సుకు అన్ని వర్గాల మేధావులను ఆహ్వనించి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వారి నుంచి బీజేపీ సలహాలు తీసుకోనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఆదిలాబాద్ సభలో అమిత్ షా వివ రిస్తారని అన్నారు. కేసీఆర్‌కు హఠావో, బీజేపీకో జీతావో.. తెలంగాణకో బచావో… అనేదే బీజేపీ నినాదామని చెప్పారు.
ప్రధాని మోదీ దిష్టిబోమ్మలను ఎందుకు దగ్ధం చేస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం రూ.9 లక్షల కోట్లు ఇచ్చినందుకా, ఇటీవల రాష్ట్రానికి పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ వంటివి ప్రకటించినందుకా, కృష్ణానదీలో తెలంగాణ నీటి వాటా ఖరారుకు ట్రిబ్యునల్ వేసినందుకా.. మోదీ దిష్టిబో మ్మలు దగ్ధం చేస్తున్నారు’అని నిలదీశారు.