తెలంగాణ వీణ , హైదరాబాద్ : సినిమాలు ఆడినా ఆడకున్నా సీరియల్స్ కు మాత్రం ఆదరణ కొనసాగుతున్నదని, సంవత్సరాల తరబడి సీరియల్స్ కొనసాగుతున్నా మహిళలు ఆసక్తిగా తిలకిస్తున్నారని సినీ నటుడు, పూర్వ పార్లమెంట్ సభ్యులు శ్రీ మురళీమెహన్ అన్నారు. తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావు ఎవర్ గ్రీన్ హీరో అని అభివర్ణించారు. సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతి లో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి – సినీ టివి నటులకు అక్కినేని ఎక్స్ లెన్స్ టివి స్టార్ అవార్డ్స్ 2023 ప్రదానోత్సవం కనుల పండువగా జరిగింది. అక్కినేని ఎవర్ గ్రీన్ పురస్కారం తో మురళీమోహన్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా కళాకారులకు దీటుగా టివి నటులు నటిస్తున్నారని అభినందించారు.అక్కినేని ఎక్స్ లెన్స్ టివి స్టార్ అవార్డ్స్ ను ప్రముఖ సీనియర్ టివి సినీ స్టార్ ప్రదీప్, నటీమణులు ఢిల్లీ రాజేశ్వరి, పద్మ జయంతి, ప్రీతి నిగమ్, అనితా చౌదరి, నటులు నగేష్ కర్రా, రామకృష్ణ (సినీగోయర్స్), వైభవ్ సూర్య స్వీకరించారు.పురస్కార నిర్ణేతల కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ అధ్యక్షత వహించిన సభ లో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్, దైవజ్ఞ శర్మ, నటి జయప్రద తమ్ముడు డాక్టర్ రాంకీ, ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కుసుమ భోగరాజు, హీరో శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ రామకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమని ఆధ్వర్యంలో జరిగిన సీల్ వెల్ సినీ సుస్వరాలు 43వ సంగీత విభావరి విశేషంగా అలరించింది. ఎ. తులసిరామ్, పి. ఎం. కె. గాంధీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.