తెలంగాణ వీణ, ఎడిటోరియల్ : వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉపశమనం కోసం ఏసీలను వినియోగించే వారి సంఖ్య మన దేశంలో ఏటేటా పెరుగుతోంది. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారికి కూడా ఏసీ అవసరమైన వస్తువుగా మారిపోయింది. అధిక వేడి, ఉక్కపోత పరిస్థితుల్లో ఏసీ ఎంతో ఉపశమనం ఇస్తుందన్నది నిజమే. అయితే ఏసీ వాడకం వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయి.
సహజ ఉష్ణోగ్రతలు ఆరోగ్యానికి మంచివి. గదిలో ఏసీ గాలిమధ్య ఎక్కువ కాలం పాటు గడిపితే అది వ్యాధి నిరోధక శక్తి బలహీన పడేందుకు దారితీస్తుంది. దీంతో తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడే రిస్క్ ఉంటుంది.
ఏసీల వాడకంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల విడుదల పెరిగి, అది పర్యావరణానికి హాని చేస్తుంది. ఉష్ణోగ్రతల్లోనూ అసాధారణమైన మార్పులు కనిపిస్తుంటాయి.
ఎక్కువ గంటల పాటు ఏసీలో గడిపిన తర్వాత నేరుగా అధిక ఎండలోకి వెళ్లిన వారికి చర్మం పొడిబారిపోయి, దురదలు, ర్యాషెస్ కు దారితీయవచ్చు.
చల్లటి గాలి రక్తనాళాలు సంకోచించేలా చేస్తాయి. దీనివల్ల అలసట, తలనొప్పి వంటివి వేధించొచ్చు.
ఏసీల్లోపలే ఉండేవారికి తాజా గాలి, వెలుతురు ఉండదు. గదిలోని దుమ్ము బయటకు పోయే అవకాశం ఉండదు. దీనివల్ల అలెర్జీలకు గురికావచ్చు. ఫలితంగా శ్వాసకోస వ్యాధులు, అలెర్జీల బారిన పడొచ్చు.
ఒకవేళ అప్పటికే ఆస్తమా లేదా అలెర్జీ వ్యాధులు ఉన్న వారికి, ఆ సమస్యలు ఏసీ కారణంగా మరింత పెరిగిపోతాయి.
ఏసీలో ఎక్కువ సమయం గడిపే వారికి కళ్లు పొడిగా మారిపోవచ్చు. కళ్లు పొడిబారినట్టు అనిపిస్తే, ఏసీ లేని గదిలో గడపాలి.
ఏసీలో ఉండడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే రిస్క్ కూడా ఉంటుంది.
ఏసీలు కొనే వారు ఆర్-32 రిఫ్రిజిరెంట్ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ రిఫ్రిజిరెంట్ పర్యావరణానికి హాని చేయదు.