తెలంగాణ వీణ , జాతీయం : రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన కీలక పరిణామం అధికార కాంగ్రెస్‌ను, అంతకంటే ఎక్కువగా విపక్ష బీజేపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న జాట్లు, దళితుల పేరిట రెండు పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల ఈ రెండు సామాజికవర్గాలను అవి ఆకట్టుకుంటే ప్రధాన పార్టీలకు తీవ్ర నష్టం తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది…
రాజస్తాన్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు ప్రముఖ జాట్ నేత, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) నేత హనుమాన్ బెనీవాల్ ప్రకటించారు. అంతేగాక 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను కూడా శనివారమే ప్రటించారాయన. మిగతా అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ ఆదరణ ఉన్న దళిత నేత, భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) పేరుతో రాష్ట్రంలో తొలిసారి బరిలో దిగుతున్నారు.
ఈ రెండు పార్టీలూ ఎన్నికల పొత్తు కుదుర్చుకుని రాజస్తాన్ బ్యాలెట్ పోరును మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. రాజస్తాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బలమైన ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం చాలా ఉందని ఈ సందర్భంగా బెనీవాల్, ఆజాద్ సంయుక్త విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇందుకోసం ‘కిసాన్, జవాన్, దళిత్’వర్గాలు కలిసి రావాలంటూ వారిచ్చిన పిలుపు వెనక లోతైన అర్థమే దాగుంది. ఈ నయా జాట్–దళిత బంధం కాంగ్రెస్, బీజేపీ అవకాశాలను బాగానే దెబ్బ తీసేలా కనిపిస్తోంది.