తెలంగాణ వీణ ,హైదరాబాద్ : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై పార్టీ ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్వేచ్ఛ కరువైందని, క్రమ శిక్షణ పేరుతో రోజుకో కొత్త నిబంధన రుద్దుతున్నారని మండిపడుతున్నారు. బండి సంజ య్ హయాంలో పార్టీ ఆగమాగం అయిపోయిందని మళ్లీ గాడిలో పెట్టాలంటూ తమ నోళ్లు మూయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా మీడియాలో హడావుడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తుం ది. కానీ, కిషన్‌రెడ్డి మాత్రం తనకు తెలియకుండా రాష్ట్రంలో ఏ ఒక్క నేత కూడా మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించారని చెప్తున్నారు. తరుచూ సమావేశాలు నిర్వహించడం, చిన్నపిల్లల మాదిరిగా క్లాసులు పీకడంవంటివి తమపై మానసికంగా ఒత్తడి పెంచుతున్నాయని వాపోతున్నారు.
చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సైతం కిషన్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈటలకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీలోకి నేతలు వరదలా వస్తారని బీజేపీ అంచనా వేసింది. అందుకు విరుద్ధంగా జరుగుతుండటంతో సీనియర్లు, ముఖ్య నేతలు ఈటలపై విమర్శలు మొదలుపెట్టారు. కొన్ని నెలలుగా పార్టీలోకి చేరికలు పూర్తిగా ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి కృష్ణయాదవ్, చీకోటి ప్రవీణ్ వంటివారిని బీజేపీలో చేరేలా ఈటల ఒప్పించారు. తీరా చివరి నిమిషంలో కిషన్‌రెడ్డి అడ్డుపుల్ల వేశారని, చేరికలను ఆపేశారని ఈటల గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిని ఈటల అవమానంగా భావిస్తున్నారని, అందుకే కొన్నాళ్లుగా వారిద్దరూ కలిసినా పెద్దగా మాట్లాడుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోదీ సభల్లో కూడా తలోదిక్కుగానే కనిపించారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డిపై సీనియర్లు, కీలక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టే, కిషన్‌రెడ్డిపైనా త్వరలో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.