తెలంగాణ వీణ : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 100 సీట్లు సాధించడం, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ‘మూడోసారి గెలిపించండి.. అభివృద్ది కొనసాగిద్దాం’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం కుకలు చింపిన విస్తరి అవుతుందని హెచ్చరించారు. బీజేపీకి ఒక చోట కూడా డిపాజిట్ రాదని తేల్చిచెప్పారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో రాష్ర్టానికి పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాళ్లు ఇచ్చే ఉత్తుత్తి హామీలను నమ్మొద్దని కోరారు. ప్రజల ప్రతి అవసరాన్ని, అన్ని వర్గాల ఆకాంక్షలను గుర్తించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని నెరవేరుస్తున్నదని తెలిపారు. ఈ విషయంపై నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంతిత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
కేసీఆర్ హామీ ఇస్తే నెరవేర్చుతారు
బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ నెల 15న ప్రజల ముందు ఉంచనున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా మ్యానిఫెస్టో ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరగడం ఖాయమని అన్నా రు. కేసీఆర్ మాట ఇచ్చాడంటే నెరవేర్చుతారనే నమ్మకం ప్రజల్లో ఉన్నదని స్ప ష్టంచేశారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ విశ్వసనీయతకు, బీజేపీ విద్వేష ప్రచారం, కాంగ్రెస్ విషప్రచారానికి మధ్య పోటీ ఉంటుందన్నారు. ప్రతిపక్షాల గాలి మాటలను, మోస పూరిత హామీలను ప్రజలు నమ్మబోరని అన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించేలా కార్యకర్తలు వివరించి చెప్పాలని సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణను అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ ఒక వైపు, తెలంగాణ పుట్టుకనే జీర్ణించుకోలేని బీజేపీ పార్టీ మరోవైపు.. 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్న బీఆర్‌ఎస్ ఒక వైపు.. రైతులకు మూడు గంటల కరంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీ, రైతుల మోటర్లకు కరంటు మీటర్లు పెడుతున్న బీజేపీ పార్టీలు మరోవైపు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ విశ్వసనీయతకు, బీజేపీ విద్వేష ప్రచారం, కాంగ్రెస్ విషప్రచారానికి మధ్యనే పోటీ. ఎటువైపు ఉండాలో ప్రజలకు స్పష్టత ఉన్నది.
-మంత్రి హరీశ్‌రావు
అంతకు ముందు సిద్దిపేట మాడ్రన్ బస్టాండ్‌లో సెల్ఫ్ ఆటోమేటిక్ బీపీ చెకప్ మిషన్ కేంద్రంతోపాటు సిద్దిపేట రూరల్ మండల ఇర్కోడులో యూనియన్ బ్యాంక్ నూతన బ్రాంచిని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధితో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని, దాని వెనుక తొమ్మిదేండ్ల కష్టమున్నదని అన్నారు. గతంలో పని దొరకలేదని, నేడు పనికి మనిషులు దొరకట్లేదనే మాటలు వింటున్నామన్నా రు. భూమికి బరువయ్యేంత పంట రాష్ట్రం లో పండుతున్నదని, అయినా గింజ మిగల కుండా మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. దీంతో ఇటు రైతులు, అటు మహిళా సంఘాలు ఆర్థికంగా లాభం పొందాయని వివరించారు.
గతంలో 200 ఉన్న పింఛన్‌ను సీఎం కేసీఆర్ రూ.2 వేలకు పెంచారని, ఇంకా పెంచేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. త్వరలో అది కూడా ప్రకటిస్తారన్నారు. కేసీఆర్ మాట తప్పడని, తెలంగాణ తెస్తా అంటే తెచ్చాడని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి సాగునీరు ఇస్తా అని ఇచ్చాడని స్పష్టంచేశారు. ఇప్పుడు కొంతమంది ఆపద మొక్కులు మొక్కుతారని, నరం లేని నాలుక ఏది పడితే అది మాట్లాడుతుందని.. అలాంటి వారి మాటలకు ఆగం కావద్దని కోరారు. కేసీఆర్ తెలంగాణను ఒక్కో మెట్టు ఎక్కించాడని.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ల చేతిలో పెడితే వైకుంఠపాళి మాదిరిగా ఒక్కసారి కిందికి పడ్తమని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర చాలా పెంచి మహిళలపై భారం మోపింది. మహిళల కోసం గ్యాస్ ధరలు తగ్గించే విషయంపై సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఆ శుభవార్త వినబోతున్నారు.
-మంత్రి హరీశ్‌రావు
–