తెలంగాణ వీణ , జాతీయం : రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అంటే ఒక్కో పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో సగటున 8 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఆ లెక్కన టికెట్లు పొందిన ఏడుగురు ఎంపీలు వారి లోక్‌సభ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేస్తారని, దాంతో గెలుపు సునాయాసమవుతుందని అధిష్ఠానం భావిస్తున్నది. అయితే టికెట్ లభించని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులూ అధిష్ఠానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అందులో కొందరు తాము స్వతంత్రంగా పోటీ చేస్తామని తిరుగుబావుటా ఎగరేశారు.
విద్యాధర్ నగర్ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నర్సత్ సింగ్ రజ్వీని కాదని ఎంపీ దియా కుమారికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఉప రాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు కావడం రాజకీయంగా ప్రాముఖ్యం సంతరించుకుంది. తనను కాదని ఎంపీకి టికెట్ ఎలా ఇస్తారని రజ్వీ బహిరంగంగానే అధిష్ఠానాన్ని నిలదీశారు.