తెలంగాణ వీణ , జాతీయం : సుప్రీంకోర్టు ఒక మహిళ గర్భస్రావంపై (అబార్షన్) కీలక ఆదేశాలు జారీ చేసింది. 26 వారాల గర్భాన్ని (ఏడు నెలలు) తొలగించేందుకు ఎయిమ్స్ కు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే, తన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. వైద్య పరమైన గర్బస్రావాన్ని వాయిదా వేయాలని ఎయిమ్స్ ను ఆదేశించింది. గర్భస్థ శిశువు (పిండం) జీవించేందుకు అవకాశాలు ఉండడంతో సుప్రీంకోర్టు తన ఆదేశాలను సమీక్షించింది.
గర్భస్రావానికి ఆదేశిస్తూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న బెంచ్ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ అడిషనరల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకోర్టును కోరారు. మెడికల్ బోర్డ్ సదరు మహిళ గర్భం నిలబడడానికి, ప్రసవించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ, కోర్టు గర్భస్రావానికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
దీంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ అప్లికేషన్ ను అధికారికంగా సమర్పించాలని కోరింది. అబార్షన్ కు అనుకూలంగా ఆదేశాలిచ్చిన బెంచ్ ముందు ఉంచుతామని పేర్కొంది. ఎయిమ్స్ వైద్యులను సదరు అబార్షన్ నిలిపివేయాలని కోరండని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. పిండం గుండె చప్పుడుని నిలిపివేయాలని ఏ కోర్టు అయినా ఎలా చెబుతుంది? అని వ్యాఖ్యానించింది.
నిజానికి బాధిత మహిళ అభ్యర్థనను మన్నిస్తూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిన్ నాగరత్న ధర్మాసనం ఆదేశాలివ్వడం గమనార్హం. తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని, మానసిక కుంగుబాటును ఎదుర్కొంటున్నందున వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని మహిళ కోరింది. సాధారణంగా వివాహిత మహిళలు, అత్యాచార బాధితురాళ్లు, మైనర్లు అవాంఛిత గర్భానికి లోనైతే 24 వారాల వరకు గర్భస్రావానికి అనుమతిస్తారు. దీన్నే మెడికల్ టెర్మినేషన్ గా చెబుతారు. 24 వారాలు నిండిన తర్వాత (6 నెలలు) గర్భస్రావానికి అరుదైన కేసుల్లోనే అనుమతి ఉంటుంది.