తెలంగాణ వీణ , సిటీ బ్యూరో : బిజినేపల్లి మండలంలోని పాలెం చెందిన లక్ష్మమ్మ (28) బుధవారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటికి వెళ్లి గురువారం తెల్లారేసరికి అదే ఇంట్లో శవమై కన్పించింది. ఈ ఘటన బిజినేపల్లి, పాలెం గ్రామాల మధ్య కోళ్ల ఫారాల వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మమ్మ బిజినేపల్లి శివారులోని పాలెం కోళ్లఫారాల వద్ద ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. బుధవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన లక్ష్మమ్మ బయటికి వెళ్లొస్తానని చెప్పింది.
తీరా గురువారం తెల్లవారుజామున లేచి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరేసుకోవడం చూసి చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ఏరియ ఆస్పత్రికి తరలించారు. కాగా లక్ష్మమ్మ ఒంటిపై కొన్ని గాయాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. రాత్రి వేళలో గుర్తు తెలియని దుండగులు లైంగికదాడికి పాల్పడి హతమార్చి ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై గురువారం సాయంత్రం నాటికి బంధువుల వద్ద నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రాములుయాదవ్ తెలిపారు. కొన్నేళ్ల కిందటనే లక్ష్మమ్మ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని స్థానికులు తెలిపారు.