తెలంగాణ వీణ , జాతీయం : జవహర్‌లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజాస్వామ్యం, నైతికత, లౌకికవాదం, సోషలిజం మొదలైనవాటిని దేశంలో పెంపొందించేదుకు నెహ్రూ కృషి చేశారని చెబుతారు. అయితే నెహ్రూ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు, వ్యక్తిగత సంబంధాలు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు చాలావరకూ తెరమరుగునే ఉన్నాయి. నెహ్రూకు గాలిపటాలు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. ఈ అభిరుచి అతనికి ఇంగ్లాండ్‌లోని హారో, కేంబ్రిడ్జ్‌లలో ఉంటున్నప్పుడు ఏర్పడింది. అదేవిధంగా నెహ్రూకు న్యాయశాస్త్రం చదవడమంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినా, తండ్రి కోరిక మేరకు లా పూర్తిచేసి, న్యాయవాదిగా మారారు. జవహర్‌లాల్ నెహ్రూకి సంబంధించి బయటి ప్రపంచానికి అంతగా తెలియని కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జవహర్‌లాల్ నెహ్రూను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో అతని సహవిద్యార్థులు ‘జో నెహ్రూ’ అని పిలిచారు. దీనికి కారణం అలా పిలవడం చాలా సులభమని వారు భావించేవారు. నెహ్రూను పూర్తి పేరుతో పిలవడం వారికి కష్టంగా అనిపించేదట.
హారో, కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు నెహ్రూకు గాలిపటం ఎగురవేయడమనేది ఒక క్రీడగా పరిచయం అయ్యింది. గాలిపటాలపై నెహ్రూకు మక్కువ మరింతగా పెరిగి, వాటిని బాగా ఎగురవేయగలిగే నైపుణ్యం సంపాదించారు. ఈ నేపధ్యంలో నెహ్రూ భారతదేశం నుండి మంచి గాలిపటాలను తెప్పించుకుని, వాటి ఎగురవేస్తూ ఆనందం పొందేవారు.