తెలంగాణ వీణ , జాతీయం : భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య 2023 వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు బెదిరింపులకు పాల్పడటం, శత్రుత్వాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాలపై కెనడాకు చెందిన ఉగ్రవాది గుర్పత్‌వంత్ సింగ్ పన్నున్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పలు సోషల్ మీడియా ఖాతాల్లో పన్నున్ బెదిరింపులకు పాల్పడిన మెసేజ్‌లు వైరల్ అవడంతో ఆయనపై కేసు నమోదు చేశామని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అజిత్ రజియన్ వెల్లడించారు.
ఇది వరల్డ్ కప్ క్రికెట్ ప్రారంభం కాదని, వరల్డ్ టెర్రర్ కప్ ప్రారంభమని బెదిరింపు మెసేజ్‌లో నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) వ్యవస్దాపకుడు కూడా అయిన గుర్పత్‌వంత్ సింగ్ పన్నున్ చెప్పారు. షహీద్ నిజ్జర్ హత్యోదంతానికి మనం ప్రతీకారం తీర్చుకోవాలని సైతం ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పన్నున్‌పై తొలి కేసు దాఖలు చేసిన 2019 నుంచి పన్నున్ కదలికలను ఎన్ఐఏ పసిగడుతోంది.
బెదిరింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉగ్రవాద చర్యలు, కార్యకపాలకు పన్నున్ పాల్పడటంతో పాటు పంజాబ్ సహా దేశవ్యాప్తంగా భయాందోళనలు, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర వహించాడని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. 2021, ఫిబ్రవరి 3న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పన్నున్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ చేసింది.