తెలంగాణ వీణ , హైదరాబాద్ : సింగరేణిలో కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు అన్ని సంఘాలు ఇప్పుడే ఎన్నికలు వద్దు అని మొత్తుకుంటున్నా.. కేంద్ర కార్మికశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణపై కార్మికశాఖ నిర్వహించిన సమావేశానికి 13 కార్మిక సంఘాలు గైర్హాజరై తమ వ్యతిరేకతను వ్యక్తపరిచినా.. కార్మికశాఖ ఎన్నికల తేదీని ఖరారు చేసింది. గైర్హాజరైన వాటిలో మూడు జాతీయ కార్మిక సంఘాలతోపాటు టీబీజీకేఎస్ కూడా ఉన్నది. కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. సింగరేణి పరిధిలో 15 కార్మిక సంఘాలుండగా.. 13 యూనియన్లు ఇప్పటికిప్పుడు గుర్తింపు ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతున్నాయి.
ఆ మేరకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్‌కు నేరుగా ఈ మెయిల్స్ కూడా పంపాయి. మెజార్టీ కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడంతో సింగరేణి యాజమాన్యం కూడా అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాలని లేబర్ కమిషనర్‌కు తెలిపింది. అయినప్పటికీ కోర్టు తీర్పును సాకుగా చూపుతూ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంపై సర్వత్రా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. సింగరేణిలో అనేక అంశాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి ఉందని, అవన్నీ సరిచేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కార్మికశాఖ మొండికేస్తే ఇటు కార్మిక సంఘాలు, అటు యాజమాన్యం కూడా మరోమారు కోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమవున్నాయి.