తెలంగాణ వీణ , క్రీడలు : స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బదులుగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేశారు. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అక్షర్ పటేల్ కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో అశ్విన్‌కు అవకాశం కల్పించారు.
సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన అశ్విన్ తన అనుభవంతో వికెట్లు పడగొట్టాడు. స్వదేశి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న అశ్విన్ అనుభవం జట్టుకు కీలకమని భావించిన సెలెక్టర్లు అతని వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తున్నది. దీనికి తోడు లోయర్ ఆర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాటింగ్ చేయడం అతనికి కలిసి రానుం ది. శనివారం ఇంగ్లండ్‌తో జరుగనున్న తొలి వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్ కోసం టీమ్‌ఇండియాతో కలిసి అశ్విన్ గురువారం గువాహటికి చేరుకున్నాడు.