తెలంగాణ వీణ , హైదరాబాద్ : ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రూ.180 కోట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. రామచంద్రాపూర్ గ్రామంలో రూ.2.36 కోట్లతో నిర్మించే 33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి బండారుపల్లి రోడ్డులోని తంగేడు మైదానానికి చేరుకొని దళిత బంధుతో పాటు గృహలక్ష్మి పథకాలకు చెందిన లబ్ధిదారులకు పథకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు తరలి వెళ్తారు.