తెలంగాణ వీణ , జాతీయం : భారతీయ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. భారతీయ వ్యవసాయ రంగంలో ఆయన అనేక విప్లవాత్మక మార్పులను సృష్టించారు. అత్యధిక స్థాయిలో దిగుబడిని ఇచ్చే అనేక వరి వంగడాలను ఆయన డెవలప్ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న రైతులకు .. దిగుబడిని పెంచే అనేక పద్ధతులను ఆయన నేర్పారు.
1987లో స్వామినాథన్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఆయన చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. స్వామినాథన్ అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఆయన రామన్ మెగస్సేసే అవార్డును సొంతం చేసుకున్నారు. 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు ఆయన్ను వరించింది.
స్వామినాథన్‌కు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్యా స్వామినాథన్, మధురా స్వామినాథన్, నిత్యా స్వామినాథన్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సౌమ్యా స్వామినాథన్.. చీఫ్ సైంటిస్టుగా ఉన్న విషయం తెలిసిందే.