తెలంగాణ వీణ , జాతీయం : ఒక పెద్ద పొరపాటు ఏకంగా సంస్థ అధినేత రాజీనామాకు దారితీసింది. చెన్నైకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో పొరపాటున రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ) లో ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజ్ కుమార్ కు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లో ఖాతా ఉంది. పొరపాటున అతడి ఖాతాలో వారం క్రితం రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. అది చూసి రాజ్ కుమార్ ఆశ్చర్యపోయాడు. దాన్ని నిజం అని నమ్మకుండా, స్కామ్ అని అనుమానించాడు.
ఇది నిజమా లేక నకిలీయా? అని తెలుసుకుందామని చెప్పి.. తన స్నేహితుడికి రూ.21,000 బదిలీ చేశాడు. సాఫీగానే బదిలీ అయ్యాయి. అరగంట తర్వాత జరిగిన పొరపాటును బ్యాంక్ గుర్తించింది, రాజ్ కుమార్ ఖాతా నుంచి జమ అయిన మొత్తాన్ని వెనక్కి తీసేసుకుంది. ఇప్పుడు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఎండీ, సీఈవో ఎస్ కృష్ణన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. తన పదవీ కాలం ఇంకా రెండొంతులు మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2022 సెప్టెంబర్ లో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఎండీ, సీఈవో బాధ్యతలను కృష్ణన్ స్వీకరించడం గమనార్హం. బ్యాంక్ బోర్డు కృష్ణన్ సమర్పించిన రాజీనామాను ఆమోదించింది. ఆర్ బీఐ నుంచి తదుపరి సూచనలు అందేంత వరకు ఆయన ప్రస్తుత పదవుల్లో కొనసాగుతారని బోర్డు స్పష్టం చేసింది.