తెలంగాణ వీణ , జాతీయం : మణిపూర్‌లో గిరిజనులు.. గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల అంశం చిచ్చు ఇంకా రగులుతోంది. నాలుగు నెలల కిందట మొదలైన అల్లర్లు.. హింసాత్మక ఘటనలకు కొంతకాలం బ్రేక్ పడినా.. తాజాగా మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రంలో జరిగిన ఘోరాలపై దర్యాప్తులో విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారని ఇటీవల తెలియడంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇద్దరు విద్యార్థుల హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌కు చెందిన పూర్వీకుల ఇంటిపై దాడిచేసేందుకు అల్లరి మూక ప్రయత్నించింది. ఇంఫాల్ శివారులో పోలీసుల పర్యవేక్షణలో ఖాళీగా ఉంటున్న బీరెన్ సింగ్‌కు చెందిన ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు. అయితే.. సీఎం బీరెన్ సింగ్ ప్రస్తుతం ఇంఫాల్‌లోని అధికార నివాసంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు.