తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై రూ. 1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కు సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు. ఎవరు ఎన్ని రకాల చరిత్రలు రాసినా.. కొన్ని చెరిగిపోని సత్యాలు ఉంటాయి. అందులో భారతదేశంలో తెలుగు వారున్నారని ఎలుగెత్తి, చాటిచెప్పింది నందమూరి తారకరామరావు మాత్రమే. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం, ఆలోచన అవసరం లేదు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఎన్టీఆర్. రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. భారతదేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. తనకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. తారక రామారావు పేరులోనే పవర్ ఉందన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పారు. దక్షిణ భారతదేశంలో అన్న ఎన్టీఆర్ సహా ఇప్పటి వరకూ హ్యాట్రిక్ ఎవరూ కొట్టలేదు. అది సీఎం కేసీఆర్‌కు త్వరలో సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.