తెలంగాణ వీణ , హైదరాబాద్ : ‘కాంగ్రెస్‌కు కాలం చెల్లింది..వారంటీ లేని ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలను ప్రజలు నమ్మొద్దు.. ప్రజల సంక్షేమాన్ని వదిలేసి స్కామ్‌లపై దృష్టి సారించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను నమ్మితే కన్నీళ్లే గతి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. వనపర్తి జిల్లాలో రూ.669.67 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు శుక్రవారం జరిగాయి. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన ‘వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభ’లో కేటీఆర్ ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ను నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగాన నిలిపి చూపించామని చెప్పారు.
బీఆర్‌ఎస్ వచ్చాకే సాగునీటితో పాలమూరు పచ్చబడిందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే.. మళ్లీ మూడు గంటల కరెంటు, తాగునీటి కోసం కుళాయిల వద్ద మహిళల కోట్లాటలు చూడాల్సి వస్తుందని, ఏడాదికో సీఎం మారుతూ.. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్‌లో రాష్ట్రానికి సీఎంలు దిగుమతి అవుతారన్నారు. కృష్ణానది నీటిలో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా 575 టీఎంసీలను కేటాయిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం పాలమూరులో నిర్వహించనున్న సభలో హామీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
కృష్ణా నీటిలో రాష్ట్రవాటా తేల్చాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖలు రాసినా, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం తెలంగాణపై వారికున్న కక్ష్య సాధింపునకు నిదర్శనమేనన్నారు. రాష్ట్రంలో ఎన్నికలొస్తున్న సమయంలో ఓట్ల కోసం ప్రధాని నరేంద్రమోదీ మాయగాడి పర్యటనలు చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. ఎగువన ఉన్న కర్ణాటక అప్పర్‌భద్రకు జాతీయహోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పించటంలో వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.
వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీని నమ్మొద్దు
