తెలంగాణ వీణ , హైదరాబాద్ : ‘మీ ఇంటి ముందున్న అభివృద్ధిని చూడండి.. మీ కళ్ల ముందుండే అభ్యర్థిని చూసి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంను చేయాలన్నారు. నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని, బీఆర్‌ఎస్ వస్తే 24 గంటలు వస్తుందని, ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు.
కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డిలు పేర్లుకే పెద్దమనుషులు
నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారు పేరుకే పెద్దమనుషులని హరీశ్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్లు పెద్దవే తప్ప వాళ్లు చేసే పనులు చిన్నవన్నారు. వారు జిల్లాను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారి పాలనలో శవాన్ని కాల్చేసి స్నానం చేద్దామంటే కరెంట్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్ పార్టీయేనని, నకిరేకల్ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా లింగయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు.