తెలంగాణ వీణ , జాతీయం : ‘ఇప్పుడు నా వయసు 67 ఏండ్లు.. ఈ వయసులో ఓటర్ల వద్దకు వెళ్లి చేతులు జోడించి మీరంతా నాకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి అని వేడుకోవాలా? ఏమనుకుంటున్నది నా గురించి అధిష్ఠానం’ అంటూ బీజేపీ సీనియర్ నేత కైలాస్ విజయవర్గీయ అధిష్టానంపై గుస్సా కావడం మధ్యప్రదేశ్‌లో బీజేపీ వర్గాలను విస్మయపరిచింది.
కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే క్రమంలో అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తలమునకలై ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే బీజేపీ పలువురు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. సాధారణంగా పార్టీ విడుదల చేసిన లిస్టులో తమ పేరుంటే నేతలు ఎగిరి గంతేస్తారు. కానీ దీనికి భిన్నమైన ఘటన బీజేపీలో చోటుచేసుకుంది. బీజేపీ అధిష్ఠానం పంపిన పేరులో ఇండోర్ 1 నియోజకవర్గానికి తనను ఎంపికచేయడంపై విజయవర్గీయ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం తనకు ఒక్క శాతం కూడా లేదన్నారు.