తెలంగాణ వీణ , హైదరాబాద్ : అత్యుత్తమ ప్రతిభ.. మంచి ర్యాంకు.. అత్యున్నత విద్యాసంస్థల్లో సీటు. ఇక జీవితంలో స్థిరపడ్డట్టేనని తల్లిదండ్రుల ధీమా. ఇవన్నీ ఒక్క ఒత్తిడి ముందు చిత్తవుతున్నాయి. చదువుల భయం.. మానసిక ఒత్తిడి ముందు పటాపంచలవుతున్నాయి. ఒకే ఒక్క చదువుల భారం.. విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నది. అత్యున్నత విద్యాసంస్థలు మొదలుకొని చిన్నాచితక కాలేజీల వరకు విద్యార్థుల ఆత్మహత్యలతో దద్దరిల్లిపోతున్నాయి. ఫలితంగా చదువుల కేంద్రంగా విలసిల్లాల్సిన క్యాంపస్‌లు చావులకు కేరాఫ్‌గా మారుతున్నాయి.
అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు సూసైడ్ క్యాంపస్‌లను తలపిస్తున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయి కొందరు.. ఒత్తిడిని తట్టుకోలేక మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. మనోవేదనతో చావును కొనితెచ్చుకొంటున్నారు. ఇది ఐఐటీల వరకే పరిమితం కాకుండా కాలేజీలు, కోచింగ్ సెంటర్ల వరకూ పాకడం గమనార్హం. జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న వారు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ, నీట్ కోచింగ్‌కు కేరాఫ్ అయిన కోటాలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. మెరిట్ విద్యార్థులు, ప్రతిభావంతులను దేశం, సమాజం కోల్పోతున్నది.
ఐఐటీల్లో హాహాకారాలు..
దేశంలోని ఐఐటీల్లో విద్యార్థుల బలవన్మరణాలు ఏటా పెరుగుతున్నాయి. ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐటీలు అన్న తేడాల్లేకుండా ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఐదేండ్ల కాలంలో 61 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నట్టు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023 మొదటి మూడు నెలల్లోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇదే విషయాన్ని కేంద్ర విద్యాశాఖ ఇటీవలే రాజ్యసభలో వెల్లడించింది. గత ఐదేండ్లల్లో తీసుకొంటే 2019, 2022 సంవత్సరాల్లో అత్యధికంగా 16 మంది చొప్పున విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు కేంద్రం తెలిపింది.
కరోనాతో 2020, 2021 రెండు సంవత్సరాల్లో విద్యార్థులంతా ఇండ్లకే పరిమితం కాగా, విద్యార్థుల ఆత్మహత్యలు తక్కువగానే చోటుచేసుకొన్నాయి. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన తర్వాత 2022లో 16 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2018 -23 మధ్యకాలంలో ఐఐటీల్లో 33 మంది, ఎన్‌టీల్లో 24 మంది ఐఐఎంలలో నలుగురు చొప్పున విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2023 మార్చిలో ఐఐటీ మద్రాస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఏడాది కాలంలో ఇద్దరు.. రెండేండ్ల వ్యవధిలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ గణాంకాలే దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడికి అద్దంపడుతున్నాయి.