తెలంగాణ వీణ ,ఏపీ బ్యూరో :సొంత భూమిని కోల్పోయిన తనపై కేసు పెట్టారని నారాయణ విమర్శ
చంద్రబాబు మనోధైర్యాన్ని కోల్పోలేదని వెల్లడి
ఉమ్మడి కార్యాచరణతో జనసేనతో కలిసి ముందుకెళతామన్న మాజీ మంత్రి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు బూటకమని టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణ అన్నారు. ఈడుపుగల్లులో 2001లో 40 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని… ఇప్పుడు దాని విలువ రూ. 7 కోట్లని… ఆ భూమి కూడా రింగ్ రోడ్డులో పోయిందని తెలిపారు. సొంత భూమిని కోల్పోయిన తనపైనే రివర్స్ లో తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజమేమిటనేది కోర్టుల్లో తేలుతుందని చెప్పారు. న్యాయస్థానంలో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. భువనేశ్వరి, బ్రహ్మణిలతో కలిసి జైల్లో ఉన్న చంద్రబాబును నారాయణ కలిశారు. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
21 రోజులుగా జైల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు మనోధైర్యాన్ని కోల్పోలేదని నారాయణ తెలిపారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతికి సంతాపం తెలియజేయమన్నారని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే విషయం ప్రజలందరికీ అర్థమయిందని చెప్పారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణను అణచి వేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న పనులతో టీడీపీకి ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గదని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతామని చెప్పారు.