తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాషాయ పార్టీ నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరుగా ఉంది. గ్రేటర్‌లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఏ నియోజకవర్గానికి కూడా సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ‘ఇంకేముంది మనకంటే ఎవ్వరూ గొప్పా’ అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం తాపత్రయ పడుతున్నారు. గ్రేటర్‌లో ఒక్కో నియోజకవర్గం నుంచి 20కి పైగా దరఖాస్తులు స్టేట్ బీజేపీ ఆఫీసుకు చేరాయి. అయితే వాటి పరిశీలన ఇప్పుడు అగ్ర నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వచ్చిన దరఖాస్తుల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలుపు గుర్రాలు లేవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో ఒకరిని ఎంపిక చేస్తే మిగిలిన వారు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలిసింది. వీరిని కాదని కొత్త వారికి టికెట్ కేటాయిస్తే ఉన్న ఆ కొద్దిపాటి క్యాడర్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. దీంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. మహానగరంలో 24 శాసన సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఇప్పట్లో తేలేటట్టు కనిపించడం లేదు.