తెలంగాణ వీణ , జాతీయం : ప్రతిపక్షాలతో కూడిన ‘ఇండియా’ కూటమి ఏర్పాడ్డక.. 37 పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకున్నట్లు ఆర్భాటంగా ప్రకటించుకున్న ఎన్‌డీఏ పతనం ప్రారంభమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. బుధవారం ఉదయం స్థానిక టి.నగర్‌లో వున్న పార్టీ ప్రధాన కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ తదితరులతో కలిసి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్‌డీఏలోని 37 పార్టీల్లో 17 లెటర్‌ప్యాడ్ పార్టీలేనని, ప్రధాన పార్టీల్లో ఒకటిగా ఉన్న అన్నాడీఎంకే ఇప్పుడు బయటకు రావడంతో ఆ కూటమి పతనం తథ్యమని తేలిపోయిందన్నారు. మహిళా బిల్లును కూడా పార్లమెంటులో తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టారే తప్ప, ఆ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఎప్పుడో అమలయ్యేదానికి ఇప్పుడెందుకు బిల్లు తెచ్చారని ప్రశ్నించారు. డీలిమిటేషన్ జరిగితే ఉత్తర-దక్షిణ భారతాలుగా దేశం చీలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించడం కేవలం డ్రామాయేనని ముత్తరసన్ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్నాడీఎంకేలో ఏ కార్యకర్తకూ ఇష్టం లేదని, అందుకే ఆ పార్టీ అధినేత్రి జయలలిత వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి వైదొలిగాక మళ్లీ ఎన్నడూ ఆ వైపు చూడలేదన్నారు. అలాంటిది ఎడప్పాడి పళనిస్వామి బీజేపీతో జతకట్టారన్నారు. బీజేపీతో అప్పుడెందుకు కలిశారో, ఇప్పుడెందుకు విడిపోయారో ఈపీఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీలది కేవలం డ్రామాయేనన్నారు. కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి రెండు రోజుల కాకముందే బీజేపీ నేతలపై ఎలాంటి విమర్శలు చేయరాదని పళనిస్వామి చెప్పారంటేనే అది డ్రామా అని స్పష్టమవుతోందన్నారు. వారి నాటకాన్ని ప్రజలు కూడా విశ్వసించడం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. కావేరిపై బీజేపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కావేరి జలాలు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చెబుతుంటే, కర్ణాటక బీజేపీ మాత్రం నీళ్లు వదిలితే ఆందోళన చేస్తామని చెబుతోందన్నారు. ఇది ఏం ధర్మమో చెప్పాలన్నారు. కర్ణాటకలో ధర్నాలు, బంద్‌లు చేపడితే ఇక్కడ తాము కూడా బంద్ చేపడతామన్నారు. రాష్ట్ర హక్కుల కోసం ఎంతదాకా అయినా వెళ్తామన్నారు. గవర్నర్ తన పరిధిని మించి వ్యవహరిస్తున్నారని, వీసీల నియామక సెర్చి కమిటీల వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకోవాల్సిన అవసరమేముందని ముత్తరసన్ ప్రశ్నించారు.