తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్ పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని ఏపీ సీఐడీ కేవియట్ దాఖలు చేసింది. క్వాష్ పిటిషన్‌పై బుధవారం ఒకేరోజు రెండు బెంచ్‌ల వద్ద విచారణ జరిగిన తరువాత కేసు అక్టోబర్ 3కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇవ్వాలని, జ్యుడీషియల్ రిమాండ్‌ను సస్పెండ్ చేయాలని, ప్రస్తుత విచారణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నారు. ఈ కేసులో తమ వాదన కూడా వినాలంటూ సీఐడీ కేవియట్ దాఖలు చేయడంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 3న ఏ బెంచ్‌లో విచారణ జరుగాలో లిస్టు కావాల్సి ఉంది. ఆ తరువాత ఉభయ పక్షాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఆ తరువాత అత్యున్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీ సీఐడీ చీఫ్‌పై టీడీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ టీడీపీ ఎంపీ కే రామ్మోహన్‌నాయడు గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి పనిచేస్తున్నారని, విచారణ జరపకుండానే చంద్రబాబుపై ఆరోపణలు చేశారని తెలిపారు. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను బహిరంగంగా మీడియాకు చెబుతున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని తెలిపారు.